Polavaram Project: నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం: కేంద్ర ప్రభుత్వం
- 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉంది
- సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది
- పైలట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయి
ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని తెలిపింది. ఈరోజు రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని... అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు.
నిర్వాసితులకు పరిహారం, పునరావాసంతో పాటు కరోనా వల్ల కూడా జాప్యం జరిగిందని బిశ్వేశ్వర్ తెలిపారు. డ్యామ్ స్పిల్ వే చానల్ పనులు 88 శాతం, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం, పైలట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు.