Amit Shah: నాగాలాండ్ ఘటనపై లోక్ సభలో ప్రకటన చేసిన అమిత్ షా
- నాగాలాండ్ లో భద్రతా బలగాల కాల్పులు
- తీవ్రవాదులు అనుకుని పౌరులపై కాల్పులు
- ఆరుగురి మృతి.. తిరగబడ్డ గ్రామస్థులు
- మరోసారి కాల్పులు జరిపిన సైన్యం
- ఈసారి ఏడుగురి మృతి
నాగాలాండ్ లో భద్రతాబలగాలు పొరబాటున సామాన్య పౌరులపై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. పౌరులను తీవ్రవాదులుగా భావించిన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తొలుత ఆరుగురు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భద్రతా బలగాలపై దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరపగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాగాలాండ్ ను భగ్గుమనేలా చేసింది.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి కిందట లోక్ సభలో ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని వెల్లడించారు. నాగాలాండ్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. నాగాలాండ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఘటనపై నాగాలాండ్ ఉన్నతాధికారులతోనూ చర్చించామని వివరించారు.
ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసిందని, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని అమిత్ షా వెల్లడించారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నతస్థాయి విచారణ జరుపుతుందని తెలిపారు. కాగా, ఇదే అంశంపై కొద్దిసేపట్లో అమిత్ షా రాజ్యసభలోనూ ప్రకటన చేయనున్నారు.