Telangana Vittal: చేరికలతో తెలంగాణ బీజేపీ బిజీ.. నేడు విఠల్, రేపు తీన్మార్ మల్లన్న
- తెలంగాణలో బలోపేతం కోసం కృషి చేస్తున్న బీజేపీ
- చేరికలపై ప్రత్యేక దృష్టి
- వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యం
- ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న విఠల్
- తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర
తెలంగాణలో పట్టు సాధించాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ అదే ఊపును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా చేరికలపై దృష్టి సారించింది. ఫలితంగా వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్ నేడు బీజేపీలో చేరబోతున్నారు. అలాగే, రేపు తీన్మార్ మల్లన్న కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విఠల్ టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగానూ పనిచేశారు. తెలంగాణ విఠల్‌గా అందరికీ సుపరిచితుడైన విఠల్ పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసింది. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఆయన నేడు కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.