Kangana Ranaut: వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు కంగన ఇచ్చిన సమాధానం ఇదీ!
- శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించిన కంగన
- జాతీయ వాదాన్ని అనుసరించే వారి తరపున ప్రచారం చేస్తానని స్పష్టీకరణ
- రైతులకు క్షమాపణ చెప్పేది లేదన్న నటి
ఇటీవలి కాలంలో బీజేపీ మౌత్ పీస్‌గా మారిన బాలీవుడ్ వివాదాస్పద నటి కంగన రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్ బృందావన్‌లోని శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించిన కంగన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు కంగన స్పందిస్తూ.. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. జాతీయ వాదాన్ని అనుసరించే వారి తరపునే తాను ప్రచారం చేస్తానన్నారు. తన వ్యాఖ్యలు కొందరిని బాధించాయన్న వార్తలపై మాట్లాడుతూ.. నిజాయతీ, ధైర్యం, జాతీయవాదం, దేశం గురించి ఆలోచించే వారికి నేను చెబుతున్నది సరైనదేనని అనిపిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు నిజమైన శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూపిస్తారని ఆశిస్తున్నానని కంగన అన్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థానంలో ఈద్గా ఉందని పేర్కొన్నారు. చండీగఢ్‌లో రైతులు తన కారును అడ్డుకోవడంపై మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనన్నారు. దానిని తాను నిరసిస్తూనే ఉంటానని కంగన తేల్చి చెప్పారు.