Sounds: చిత్తూరు జిల్లాలో అంతుచిక్కని వింతశబ్దాలు...ప్రజల్లో భయాందోళనలు

Mysterious sounds creates panic in Chittoor district

  • కౌండిన్య అటవీప్రాంతం పరిధిలో వింతశబ్దాలు
  • గ్రామాల్లో అదురుతున్న భూమి, గోడలకు పగుళ్లు
  • ప్రజలకు కళ్లు తిరుగుతున్న వైనం
  • నిపుణులు పరిశీలించాలంటున్న స్థానికులు

చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అటవీప్రాంతం పరిధిలో కొంతకాలంగా వింత శబ్దాలు వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాలను ఆనుకుని కౌండిన్య అటవీప్రాంతం విస్తరించి ఉంది.

పలమనేరు మండలం నలగాంపల్లి, సంబార్ పూర్, కరిడిమొడుగు గ్రామాలతో పాటు నల్లగుట్టపల్లి, ఎస్సీ కాలనీ, ఓటేరుపాళెం, తిమ్మయ్యగారిపల్లి గ్రామాల్లో వింత శబ్దాలు వస్తున్నట్టు ప్రజలు చెబుతున్నారు. శబ్దాలు రావడం మాత్రమే కాదు, భూమి అదిరనట్టవుతోందని, గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాదు, కళ్లు తిరిగినట్టవుతోందని అక్కడివారు వెల్లడించారు.

ఈ వింత శబ్దాలతో హడలిపోతున్న ప్రజలు ఇళ్లను వదిలి ఊరు బయట ఉన్న గుట్టలపైకి చేరుకుంటున్నారు. గత గురువారం రాత్రంతా వారు గుట్టలపైనే ఉన్నట్టు తెలిసింది.

కాగా, దీనిపై ఓ వాదన వినిపిస్తోంది. గతంలో అక్కడ భూగర్భజలాలు చాలా కిందికి వెళ్లిపోయాయని, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మళ్లీ భూగర్భ జలాలు పైకి ఉబికి వస్తున్నాయని, ఈ కారణంగానే భూమి పొరల్లోని ఖాళీల్లోకి నీరు ప్రవేశిస్తున్నందున శబ్దాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. దీనిపై నిపుణులు పరిశీలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News