Sushil: భార్యాబిడ్డలను హతమార్చిన వైద్యుడు...  కరోనా నుంచి విముక్తి కలిగించానని వెల్లడి

Doctor kills wife and children amid corona scares
  • కాన్పూర్ లో ఘటన
  • మానసికంగా కుంగిపోయిన వైద్యుడు
  • ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత ఆందోళన
  • టీలో మత్తుమందు కలిపి ఘాతుకం
  • ఆపై పరారీ
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. కరోనా భయాలతో ఓ వైద్యుడు భార్యాబిడ్డలను అంతమొందించాడు. కరోనా భయాల నుంచి వారిని విముక్తులను చేశానంటూ లేఖలో పేర్కొనడం అతడి మానసిక స్థితికి అద్దం పడుతోంది.

సుశీల్ అనే వైద్యుడు కాన్పూర్ లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య చంద్రప్రభ, శిఖర్ సింగ్ అనే కుమారుడు, ఖుషీ సింగ్ అనే కుమార్తె ఉన్నారు. డాక్టర్ సుశీల్ కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడు. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో మరింత ఆందోళనకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు, కుమార్తెలకు టీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వారు స్పృహకోల్పోయాక భార్యను గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత కుమారుడు, కుమార్తెను సుత్తితో కడతేర్చాడు. వారు చనిపోయినట్టు నిర్ధారించుకున్న అనంతరం డాక్టర్ సుశీల్ తన డైరీలో హత్యలకు కారణాన్ని వివరించాడు.

కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టదని, ఈ కష్టకాలంలో కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయలేనని పేర్కొన్నాడు. అందుకే కుటుంబంలోని అందరికీ విముక్తి కలిగించానని, ఒక్క క్షణంలో వారు ఈ కష్టాలన్నింటి నుంచి బయటపడ్డారని వెల్లడించాడు. తాను నయం కాని వ్యాధితో బాధపడుతున్నానని వివరించాడు.

అంతేకాదు, ఈ హత్యల విషయం పోలీసులకు తెలియజేయాలని తన సోదరుడు సునీల్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సునీల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి చూసేసరికి చంద్రప్రభ, శిఖర్ సింగ్, ఖుషీ సింగ్ విగతజీవుల్లా కనిపించారు. హత్యల అనంతరం డాక్టర్ సుశీల్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Sushil
Murders
Family Members
Kanpur
Uttar Pradesh

More Telugu News