YS Jagan: వారానికి ఐదు రోజులు కోర్టుకొస్తే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయి: తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఎం జగన్

YS Jagan petition On daily attendance on court

  • రోజువారీ హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్
  • సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రోజువారీ విచారణకు రావడం కష్టం
  • ముఖ్యమంత్రి కాకముందు రోజువారీ విచారణకు హాజరయ్యారన్న న్యాయవాది
  • విచారణ ఆరో తేదీకి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు ఇది వరకే కొట్టివేసింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది.

జగన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వారానికి ఐదు రోజులు కోర్టు విచారణకు హాజరైతే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, రోజువారీ కార్యక్రమాలకు కూడా ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. అంతేకాకుండా విచారణకు హాజరైతే ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ప్రతి వారం కోర్టు విచారణకు హాజరయ్యారని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కోర్టు నుంచి అనుమతి పొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జగన్‌పై ఉన్న కేసుల్లో కొన్ని 2జీ కేసు కన్నా ఐదు రెట్లు సంక్లిష్టమైనవని, కాబట్టి విచారణకు ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.  ప్రతిసారి విచారణకు హాజరు కావడం సాధ్యం కాదన్నారు. ప్రజా విధుల్లో ఉన్నవారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఉన్న కేసుల్లో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరాతీశారు. అనంతరం సీబీఐ వాదన నిమిత్తం విచారణను ఆరో తేదీకి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News