Supreme Court: పాక్ నుంచి కలుషిత గాలి వస్తోందన్న యూపీ సర్కార్.. పాక్ లో పరిశ్రమలను మూయించాలా? అన్న సుప్రీంకోర్టు

Do You Want Us To Ban Industries In Pakistan Supreme Court Serious Over UP Argument On Delhi Pollution

  • ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
  • పరిశ్రమలను మూసేయడంపై యూపీ అభ్యంతరం
  • అసహనం వ్యక్తం చేసిన సీజేఐ ఎన్వీ రమణ
  • ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం
  • టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన కేంద్రం

ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పాకిస్థాన్ నుంచి కలుషిత గాలులు వస్తున్నాయని, దాని వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలోని కాలుష్యానికి యూపీ పరిశ్రమలతో సంబంధం లేదని పేర్కొన్న యూపీ.. పరిశ్రమల మూసివేతపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలు 8 గంటలే పనిచేయాలన్న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ నిర్ణయం వల్ల చెరకు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొంది.

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ‘ఏం చేయమంటారు? పాకిస్థాన్ లోని పరిశ్రమలను మేం మూసేయించాలా? వాటిపై నిషేధం విధించమంటారా?’’ అని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలో స్కూళ్లను మూసేశామని, ఆసుపత్రుల నిర్మాణ పనులను మాత్రమే కొనసాగిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాటిపై నిషేధం విధించడం వల్ల హెల్త్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులపై ప్రభావం పడుతుందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ ప్రభుత్వ వాదనకు మద్దతు తెలిపింది. దీంతో ఆసుపత్రుల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇక, ఐదుగురు సభ్యుల టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి ఎంటరయ్యే 124 మార్గాల్లో ఇన్ స్పెక్షన్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పింది.

  • Loading...

More Telugu News