Parag Agarwal: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ కు కళ్లు చెదిరే జీతం!
- ఏడాదికి 1 మిలియన్ డాలర్ల వేతనం
- రూ. 94 కోట్ల విలువైన కంపెనీ షేర్లు
- 2011లో ట్విట్టర్లో చేరిన పరాగ్ అగర్వాల్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులైన సంగతి తెలిసిందే. జాక్ డోర్సే సీఈవో పదవికి రాజీనామా చేయడంతో... పరాగ్ అగర్వాల్ ఆ బాధ్యతలను అందుకున్నారు. పరాగ్ జీతానికి సంబంధించిన వివరాలను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు ట్విట్టర్ తెలిపింది.
ఏడాదికి 1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్లకు పైగా) వేతనాన్ని ఆయన పొందుతారని చెప్పింది. దీంతో పాటు 1.25 మిలియన్ డాలర్ల (రూ. 94 కోట్లు) విలువైన షేర్లను కూడా ఆయన పొందుతారని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పరాగ్ అగర్వాల్ కు షేర్లు అందుతాయని చెప్పింది. పరాగ్ అగర్వాల్ ముంబై ఐఐటీలో చదివారు. అనంతరం మైక్రోసాఫ్ట్, యాహూ, ఎల్ అండ్ టీ ల్యాబ్స్ లో పని చేశారు. 2011లో ఆయన ట్విట్టర్ లో చేరారు. 2017లో ఆ సంస్థ సీటీవోగా బాధ్యతలను నిర్వహించారు.