Lionel Messi: ‘బాలన్ డి ఓర్’ అవార్డును ఏడోసారి అందుకున్న ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. సరికొత్త చరిత్ర

Lionel Messi Wins Mens Ballon d Or For record Seventh Time

  • ఫుట్‌బాల్ ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి అవార్డు ప్రదానం
  • ఐదుసార్లు ఈ అవార్డును అందుకున్న రొనాల్డో
  • ఊహించలేదన్న మెస్సీ
  • కోపా అమెరికా కప్‌లో గెలుపు వల్లే సాధ్యమైందన్న మెస్సీ
  • మహిళల విభాగంలో తొలిసారి అవార్డు అందుకున్న బార్సిలోనా కెప్టెన్ అలెగ్జియా

అర్టెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్రీడలో ఉత్తమ ప్రతిభ అందించే వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘బాలన్ డి ఓర్’ అవార్డును ఏకంగా ఏడోసారి అందుకుని చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లోనూ ఈ అవార్డును అందుకున్న మెస్సీ తాజాగా ప్యారిస్‌లో జరిగిన వేడుకల్లో మరోమారు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. మరో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఐదుసార్లు ఈ అవార్డును సొంతం  చేసుకున్నాడు.

ఈ అవార్డు కోసం మొత్తం 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, చివరికి రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అవార్డు అందుకుంటున్నప్పుడు అదే చివరిదని భావించానని పేర్కొన్నాడు. ‘కోపా అమెరికా కప్’ను గెలుచుకోవడం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నాడు.  

ఈ ఏడాది జరిగిన ‘కోపా అమెరికా కప్’ ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా కప్పును ఎగరేసుకుపోయింది. అర్జెంటీనా ఓ మెగా టైటిల్‌ను అందుకోవడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దేశానికి కప్పు అందించిపెట్టిన మెస్సీపై ప్రశంసలు కురిశాయి. కాగా, మహిళల విభాగంలో స్పానిష్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్ అలెగ్జియా పుటెల్లాస్ ‘బాలన్ డి ఓర్’ అవార్డును తొలిసారి గెలుచుకుంది.

  • Loading...

More Telugu News