CM Jagan: వరద సహాయక చర్యలపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం
- నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వరద బీభత్సం
- సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
- బాధితుల పట్ల ఉదారంగా స్పందించాలని సూచన
- అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశాలు
ఏపీలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం జగన్ నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వరద నష్టం అంచనా, రూ.2 వేలు అదనపు సాయం, సాయం పంపిణీ, పాక్షికంగా/పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ పరిష్కారానికి తీసుకున్న చర్యలు, చెరువులకు గండ్లు, చెరువుల పటిష్టతకు తీసుకన్న చర్యలు, మరణించిన పశువులకు పరిహారం, రహదారుల మరమ్మతులు, నిత్యావసరాల పంపిణీ తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.
పూర్తిగా ఇళ్లు ధ్వంసమైతే కొత్త ఇళ్లను మంజూరు చేసి తక్షణమే పనులు మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని, పంట నష్టంపై ఎన్యూమరేషన్ తో పాటు సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. చెరువులకు వచ్చే వరద నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అన్నారు. వరద నీటిని కాలువల ద్వారా బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలని వివరించారు.
వరద బాధితులను సమగ్ర రీతిలో ఆదుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు. బాధితుల సమస్యల పట్ల మానవీయ కోణంలో స్పందించాలని సూచించారు.