Mary Lori Heral: బీహార్ కుర్రాడ్ని వలచిన ఫ్రెంచ్ వనిత... ఓ ఖండాంతర ప్రేమకథ
- ఆరేళ్ల కిందట ఫ్రాన్స్ నుంచి భారత్ వచ్చిన మేరీ
- ఢిల్లీలో ఆమెకు రాకేశ్ పరిచయం
- రాకేశ్ ఓ టూర్ గైడ్
- ఇరువురు గత ఆదివారం పెళ్లి చేసుకున్న వైనం
విదేశీ మహిళలు భారతీయులను పెళ్లాడడం కొత్తేమీ కాదు. ఒకే చోట పనిచేస్తూ ప్రేమలో పడి, ఆపై వివాహంతో ఒక్కటైన జంటలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఫ్రాన్స్ కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త... భారత్ కు చెందిన ఓ సాధారణ టూర్ గైడ్ ను ప్రేమించి పెళ్లాడడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆమె పేరు మేరీ లోరీ హెరాల్. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నివసించే మేరీ ఓ వ్యాపారవేత్త. ఆరేళ్ల కిందట ఆమె భారత్ వచ్చింది.
ఆ సమయంలో రాకేశ్ అనే టూర్ గైడ్ పరిచయం అయ్యాడు. భారత్ లోని ప్రముఖ పర్యాటక స్థలాలను విదేశీయులకు చూపించే గైడ్ గా రాకేశ్ పనిచేస్తున్నాడు. రాకేశ్ స్వస్థలం బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలో ఉండే కథారియా గ్రామం. అయితే ఉపాధి కోసం ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఫ్రెంచ్ యువతి మేరీ అక్కడే పరిచయం అయింది. రాకేశ్... మేరీకి అనేక పర్యాటక ప్రాంతాలు చూపించాడు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి వివరించాడు. భారత్ పై ఆమెలో అభిమానాన్ని పెంచడమే కాదు, తన వ్యక్తిత్వంతో ఆ ఫ్రెంచ్ అమ్మాయి మనసు కూడా దోచుకున్నాడు.
కొన్నిరోజుల తర్వాత మేరీ తిరిగి పారిస్ వెళ్లిపోయింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఫోన్ ద్వారా స్నేహం కొనసాగింది. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని అర్థం చేసుకున్న వారు తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మేరీ మూడేళ్ల కిందట ప్యారిస్ రావాలంటూ రాకేశ్ ను ఆహ్వానించింది. ప్యారిస్ వస్తే కలిసి వ్యాపారం చేద్దామంటూ ప్రతిపాదించింది. దాంతో రాకేశ్ పారిస్ వెళ్లగా, ఇద్దరూ కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లితో ఒక్కటవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి కూడా అనుమతి లభించడంతో ఆ జంట ఆనందానికి అవధుల్లేవు.
ఇంకేముంది... మేరీ కుటుంబం భారత్ వచ్చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం రాకేశ్, మేరీ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం బెగుసరాయ్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా భోజ్ పురీ గీతాలకు అదిరిపోయేలా నృత్యాలు చేశారు. కొత్త జంట కొన్నాళ్ల పాటు భారత్ లోనే గడిపి, అనంతరం పారిస్ వెళ్లనుంది.
ఏదేమైనా ఓ సామాన్యుడ్ని సంపన్నురాలు పెళ్లాడడం ఎక్కువగా సినిమాల్లోనే కనిపిస్తుంది. అది కూడా దేశాల సరిహద్దులు దాటి వచ్చి మరీ మేరీ తన జీవితభాగస్వామి చేయందుకోవడం నిజంగా విశేషమే.