Nara Lokesh: ఈ విధంగా జరిగితే యువతకు ఉద్యోగాలు ఎక్కడ్నించి వస్తాయి?: నారా లోకేశ్
- సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
- పత్రికా కథనాల ఆధారంగా వ్యాఖ్యలు
- రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన ఏదీ అంటూ ఆగ్రహం
- పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పరిశ్రమలు గుడ్ బై చెప్పడమే కాదు, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు విముఖత చూపుతూ ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నాయని వివరించారు. టాటా గ్రూపు... 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయతలపెట్టిన సెమికండక్టర్ పరిశ్రమ కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వైపు చూస్తోందని వెల్లడించారు. ఆ మేరకు ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అంతేకాదు, లులూ గ్రూప్ ఏపీకి ఇక జన్మలో వచ్చేది లేదని తీర్మానించుకుందంటూ మరో వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు.
చంద్రబాబు హయాంలో వైజాగ్ పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంలా విలసిల్లిందని, కానీ జగన్ వచ్చి ఒప్పందాలను రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. "లులూ గ్రూప్ కానివ్వండి, సింగపూర్ పరిశ్రమల కన్సార్టియం కానివ్వండి, టాటా రెన్యూవబుల్ పవర్, ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమలు కానివ్వండి ... జగన్ అతడి ముఠా కారణంగా ఏపీకి దూరమయ్యాయి. ఇక్కడి ప్రజలకు ఉపాధి దూరమైంది. ఏపీ ఇంత దుస్థితిలో చిక్కుకోవడానికి జగనే కారణం" అని విమర్శించారు.