Madhya Pradesh: అగ్రవర్ణాల మహిళలను బయటకు ఈడ్చుకురావాలన్న మధ్యప్రదేశ్ మంత్రి క్షమాపణ
- అగ్రవర్ణాల మహిళలు ఇళ్లకే పరిమితమవుతున్నారు
- వారు కూడా బయటకు వచ్చి పనిచేస్తేనే సమానత్వం వస్తుంది
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు
- బాధపడి ఉంటే క్షమించండి
అగ్రవర్ణ కుటుంబాల్లోని మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని, వారు కూడా బయటకు వచ్చి పురుషులతో కలిసి పనిచేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. మూడు రోజుల క్రితం అనుప్పుర్ జిల్లాలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత మాట్లాడుతూ.. ఠాకూర్, థాకరే వంటి అగ్రకులాల్లోని మహిళలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారని, వారిని బయట పనులకు పంపరని అన్నారు. కానీ కిందిస్థాయి కుటుంబాల్లోని మహిళలు మాత్రం ఇళ్లలోను, పొల్లాలోనూ పనిచేస్తున్నారని చెప్పారు.
సమాజంలో స్త్రీపురుషులు సమానమే అయినప్పుడు మహిళలు కూడా తమ బలాన్ని గుర్తించి పురుషులతో కలిసి పనిచేయాలని అన్నారు. కాబట్టి అగ్రవర్ణాల మహిళలను బయటకు లాగి సమానత్వాన్ని తీసుకురావాలని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. మహిళలు సామాజిక సేవ చేయాలని మాత్రమే తాను అన్నానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.