Sharbat Gulla: ఆఫ్ఘనిస్థాన్ అభినేత్రికి ఇటలీ ఆశ్రయం
- 80వ దశకంలో ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధం
- పాకిస్థాన్ కు పారిపోయిన షర్బత్ గుల్లా కుటుంబం
- 12 ఏళ్ల వయసులో ఓ ఫొటోగ్రాఫర్ కంటబడిన షర్బత్
- ఆమె కళ్ల పట్ల విపరీతంగా ఆకర్షితుడైన ఫొటోగ్రాఫర్
- నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో దశాబ్దాల తరబడి కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 80వ దశకంలో సోవియట్ బలగాలకు, స్థానిక శక్తులకు మధ్య జరిగిన యుద్ధం భీకరమైనది. అనేక లక్షల మంది ఆఫ్ఘన్లు ఈ యుద్ధంలో మరణించారు. లక్షల మంది దేశం విడిచి పారిపోయారు. ఆ విధంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ చేరిన వారిలో షర్బత్ గుల్లా ఒకరు.
అప్పటికి షర్బత్ 12 ఏళ్ల బాలిక. ఓ శరణార్థి శిబిరంలో ఉండగా స్టీవ్ మెక్ కర్రీ అనే విదేశీ ఫొటోగ్రాఫర్ ఆమె కళ్లను చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు. పచ్చ రంగులో మెరుస్తున్న ఆమె కళ్లలో ఏదో మ్యాజిక్ ఉందని భావించిన మెక్ కర్రీ ఆమెను ఒక ఫొటో తీశాడు. అయితే ఆ ఫొటో తర్వాత కాలంలో సంచలనం సృష్టిస్తుందని అతడు ఏమాత్రం ఊహించలేదు. ఆఫ్ఘన్ యుద్ధం తాలూకు చేదు అనుభవాలతో భయం నిండిన ఆ పచ్చని ఆ కళ్లు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
షర్బత్ గుల్లా ఫొటో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురితం కావడంతో ఆమె ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఆ మ్యాగజైన్ ప్రతులు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తనకు అంత పేరొచ్చిన సంగతి ఆమెకు తెలియదు. తదనంతర కాలంలో షర్బత్ రొట్టెలు తయారుచేసి విక్రయించే రహ్మత్ గుల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి నలుగురు పిల్లలు కలిగారు.
అయితే, నకిలీ గుర్తింపు పత్రాలు కలిగి ఉందని ఆరోపిస్తూ, ఆమెను పాకిస్థాన్ ప్రభుత్వం 2016లో శరణార్థి శిబిరం నుంచి సొంత దేశానికి పంపించింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ఉన్నారు. అప్పటికే నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కవర్ పేజీ అమ్మాయిగా ఎంతో ఖ్యాతి పొందిన విషయం తెలుసుకున్న దేశాధ్యక్షుడు అష్రఫ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. రాజధాని కాబూల్ లో ఓ అపార్ట్ మెంట్ తాళాలను ఆమెకు అందించారు. 80వ దశకం నుంచి 90వ దశకం వరకు ప్రపంచం దృష్టిలో పడిన అత్యుత్తమ ఫొటోగ్రాఫ్ షర్బత్ కు చెందినదేనని, ఆమె కళ్లలోని సౌందర్యం, చూపులకున్న వాడి అమోఘం అని కొనియాడారు.
తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం చేజిక్కించుకునేంత వరకు ఆమె జీవితం ఫర్వాలేదనిపించేలా సాగింది. అయితే కొంతకాలం కిందట భర్త చనిపోయాడు. దాంతో తాలిబన్ల పాలనలో బతుకు దుర్భరం అవుతుందని భావించిన షర్బత్ ఇటలీ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరింది. దాంతో ఆమె మరోసారి ప్రపంచం దృష్టిలో పడింది. 80వ దశకంలో తన కళ్లతో అందరినీ కుదిపేసిన ఆమెను, ఇప్పుడు చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా, షర్బత్ కు ఇటలీ దేశాధినేత మారియో ద్రాఘి ఆశ్రయం కల్పించారు. ఆమె రోమ్ నగరం చేరుకున్న అనంతరం ద్రాఘి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చరిత్రలో నాడు ఆఫ్ఘనిస్థాన్, ఆ దేశ ప్రజలు ఎదుర్కొన్న యుద్ధాలు, సంఘర్షణలకు ఆమె ఓ ప్రతీక అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.