Central Team: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం
- దక్షిణ కోస్తా, రాయలసీమను అతలాకుతలం చేసిన వర్షాలు
- పలు జిల్లాల్లో వరదలు
- నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందం
- నేడు చిత్తూరు జిల్లాలో పర్యటన
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఆయా జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా భారీ నష్టం చోటుచేసుకుంది. నష్టం అంచనా నిమిత్తం కేంద్ర బృందం నేడు రాష్ట్రానికి వచ్చింది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో వరి పంటను పరిశీలించారు. కూచివారిపల్లి, భీమవరం గ్రామాల్లో 180 కుటుంబాలకు గాను 32 కుటుంబాలకు చెందిన పంట పూర్తిగా దెబ్బతిన్నదని కేంద్ర బృందం గుర్తించింది.
పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులు నిర్ధారించారు. తమ పర్యటనలో భాగంగా వారు భీమా నది పరీవాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కేంద్ర బృందం వెంట చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ కూడా ఉన్నారు. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన వివరాలను ఆయన కేంద్ర బృందానికి తెలియజేశారు. కేంద్ర బృందం సభ్యులకు రైతులు తమ పొలాల్లో దెబ్బతిన్న వరి, వేరుశనగ పంటను తీసుకువచ్చి చూపించారు.