Corona Virus: కరోనా కొత్త వేరియంట్ ఎయిడ్స్ రోగి నుంచి వచ్చినట్టు అనుమానం
- ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్
- బి.1.1.529గా నామకరణం
- అత్యంత బలమైన స్పైక్ ప్రొటీన్ దీని సొంతం
- 32 మ్యుటేషన్లతో మొండి వైరస్ గా కొత్త వేరియంట్
ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ (బి.1.1.529) సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త రకం కరోనా కారణంగా 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఎయిడ్స్ రోగి నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారు.
దీనిపై లండన్ కు చెందిన యూసీఎల్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త ఒకరు స్పందించారు. బహుశా కరోనా తాజా వేరియంట్ చికిత్స తీసుకోకుండా మనుగడ సాగిస్తున్న ఒక హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగి నుంచి ఇతరులకు సంక్రమించి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. అతడు దీర్ఘకాలంగా వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీసే వ్యాధితో పోరాడుతూ ఉండి ఉంటాడని, అతడిలో అభివృద్ధి చెందిన ఈ కొత్త వేరియంట్ ఇతరులకు వ్యాపించి ఉండొచ్చని ఆ శాస్త్రవేత్త వివరించారు.
సాధారణంగా కరోనా వైరస్ లో ఉండే స్పైక్ ప్రొటీన్ మానవదేహంలో వైరస్ ప్రవేశానికి, వైరస్ అభివృద్ధికి తోడ్పడుతుంది. కరోనా వ్యాక్సిన్లు ఈ స్పైక్ ప్రొటీన్ ను దెబ్బతీసే లక్ష్యంతోనే తయారయ్యాయి. అయితే బి.1.1.529 వేరియంట్ లో ఈ స్పైక్ ప్రొటీన్ లో 32 మ్యుటేషన్లు (జన్యు మార్పులు) ఉన్నట్టు గుర్తించారు. ఆ లెక్కన ఇప్పుడున్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ ను ఏ మేరకు కట్టడి చేస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.