Asaduddin Owaisi: నేను ఎవరి ఏజెంటునో మీరందరూ కూర్చొని, డిసైడ్ చేసి చెప్పండి: ఒవైసీ సెటైర్లు

Whose Agent Decide says Asaduddin Owaisi

  • యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
  • 100 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన ఒవైసీ
  • ఎంఐఎంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు

బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. యూపీలో 100 సీట్లలో పోటీ చేస్తామని ఇప్పటికే ఒవైసీ ప్రకటించారు. మరోవైపు ఎంఐఎం పార్టీపై బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీలపై ఒవైసీ సెటైర్లు వేశారు.

'యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం చెపుతున్నారో మీరు వినే ఉంటారు. సమాజ్ వాది పార్టీ ఏజెంట్ ఒవైసీ అని యోగి అంటున్నారు. నేను బీజేపీ ఏజెంట్ అని సమాజ్ వాది పార్టీ అంటోంది. నేను పలానా పార్టీకీ బీ టీమ్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒకటే చెపుతున్నా. అందరూ కలసి కూర్చొని చర్చించుకోండి. నేను ఎవరి ఏజెంటునో డిసైడ్ చేయండి' అని ఒవైసీ దెప్పిపొడిచారు.

గత బీహార్ ఎన్నికల్లో 20 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ముఖ్యంగా ముస్లిం జనాభా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. అంతేకాదు ముస్లిం ఓట్లను ఎంఐఎం పెద్ద ఎత్తున చీల్చింది. దీంతో ఎంఐఎంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఒక పార్టీకి బీ టీమ్ గా పని చేస్తూ తమ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఒవైసీని ఉపయోగించుకోవడం వల్ల బీహార్ లో బీజేపీ కొంత మేర విజయవంతమయిందని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురి అన్నారు. అందుకే ఓట్లు చీల్చే ఒవైసీ సాహబ్ విషయంలో అన్ని సెక్యులర్ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరో కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ... ఒవైసీ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు.

మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ ఏజెంట్ ఒవైసీ అని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి ఒవైసీ తీసుకుపోతున్నారని ఆరోపించారు. కానీ తమ పాలనలో యూపీ ఇప్పుడు చాలా మారిపోయిందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రశాంత పరిస్థితిని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా... దాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు.

Asaduddin Owaisi
MIM
Uttar Pradesh
Assembly Elections
  • Loading...

More Telugu News