Uttar Pradesh: క్షవరం చేయడానికి నిరాకరణ.. సెలూన్ యజమానిని తుపాకితో కాల్చి చంపిన వైనం!
- ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఘటన
- పాతబాకీ చెల్లిస్తేనే కటింగ్ చేస్తానన్న సెలూన్ యజమాని
- మాటమాట పెరగడంతో తుపాకితో కాల్చివేత
- తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమం
క్షవరం చేయడానికి నిరాకరించిన సెలూన్ యజమానిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా అగౌతా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సమీర్ అనే వ్యక్తి క్షవరం చేయించుకునేందుకు ఇర్ఫాన్ సెలూన్‌కు వెళ్లాడు. అప్పటికే సమీర్ అతడికి బాకీ ఉండడంతో అది చెల్లిస్తేనే కటింగ్ చేస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
అది మరింత ముదరడంతో కోపంతో ఊగిపోయిన సమీర్ తుపాకితో ఇర్ఫాన్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఇర్ఫాన్ సోదరుడు ఇమ్రాన్, అతడి అంకుల్ జావేద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
గొడవ తర్వాత ఇంటికెళ్లిన సమీర్.. షాహిద్, షఖీర్, తాఖిర్‌లతో కలిసి తమ లైసెన్స్‌డ్ తుపాకితో ఇంటిపైనుంచి సెలూన్‌లోకి పలు రౌండ్లు కాల్పుల జరిపినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఇర్ఫాన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇర్ఫాన్ తల్లి జీనా ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.