Chandrababu: ఊరు ఊరే తుడిచిపెట్టుకుపోయిన ప‌రిస్థితి: చంద్ర‌బాబు

chandrababu slams ycp

  • ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం శాపంగా మారింది
  • అన్న‌మ‌య్య ప్రాజెక్టుకు గేట్లు పెట్టేందుకు డ‌బ్బులు  ఇవ్వ‌లేదు
  • రాయ‌ల చెరువుకు ఎన్న‌డూ ఇన్ని నీళ్లు రాలేదు
  • ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుని స‌మ‌ర్థంగా ప‌నిచేయాల్సింది
  • ఆ ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేకుండా పోయింది

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు శాపంగా మారిందని మండిప‌డ్డారు. రెండు రోజులుగా తాను వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు ప‌డుతోన్న క‌ష్టాల గురించి తెలుసుకున్నాన‌ని తెలిపారు.

వ‌ర్షాలు ఈ ఏడాది ఎక్కువ‌గా ప‌డ‌తాయ‌ని ముందుగానే ప్ర‌భుత్వానికి తెలుస‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. రాయ‌ల‌సీమ‌లోనూ వాన‌లు జోరుగా ప‌డ‌తాయ‌ని వార్త‌ల్లోనూ వ‌చ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ముందే తెలిసిన‌ప్పుడు ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుండా, పూర్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పారు.

ఇటువంటి ప్ర‌కృతి వైప‌రీత్యాలు చెప్పి రావ‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స‌మ‌ర్థంగా ప‌నిచేయాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. మ‌రోవైపు రాష్ట్రంలోని ప‌లు ప్రాజెక్టుల విష‌యంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న అన్నారు.

పింఛ‌, అన్న‌మ‌య్య ప్రాజెక్టుల‌పై అప్ర‌మ‌త్తం చేయ‌లేక‌పోయార‌ని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. అన్న‌మ‌య్య ప్రాజెక్టుకు గేట్లు పెట్టేందుకు డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. నాసిర‌కం ప‌నులు కూడా ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేశాయ‌ని విమ‌ర్శించారు. ఊరు ఊరే తుడిచిపెట్టుకుపోయిన ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. రాయ‌ల చెరువుకు ఎన్న‌డూ ఇన్ని నీళ్లు రాలేద‌ని ఆయ‌న అన్నారు.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుని స‌మ‌ర్థంగా ప‌నిచేస్తే ఇన్ని ఇబ్బందులు త‌లెత్తేవి కాద‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేకుండా పోయింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌కృతి విప‌త్తుల‌తో పాటు మాన‌వ త‌ప్పిదం కూడా తోడు కావ‌డంతోనే న‌ష్టం భారీగా జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. మాన‌వ త‌ప్పిందంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News