BJP: జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి ఘటన.. స్పందించిన బీజేపీ

BJP Responds about the GHMC Incident

  • తాము శాంతియుతంగానే నిరసన తెలిపామన్న బీజేపీ కార్పొరేటర్లు
  • పోలీసుల తోపులాటలో కుండీలు మాత్రమే ధ్వంసమయ్యాయన్న  నేతలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం బీజేపీ నేతలపైనా కేసులు

హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి ప్రవేశించిన బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, ఆపై ధ్వంసం చేశారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్లు స్పందించారు. తాము దాడికి పాల్పడలేదని, బల్దియా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులు పెండింగులో ఉన్నాయని నిరసన మాత్రమే వ్యక్తం చేశామని తెలిపారు. తాము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేశామని, సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో పోలీసుల తోపులాట కారణంగా పూలకుండీలు ధ్వంసమయ్యాయని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిన్న ఆందోళన చేసిన బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఆస్తిని ధ్వంసం చేసిన 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతోపాటు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్ కొందరు బీజేపీ గూండాలు హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ దౌర్జన్యపూరిత వైఖరిని గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు. గాడ్సే భక్తులను గాంధేయ మార్గంలో నడవమని చెప్పడం ఎంత కష్టమో దీన్నిబట్టే అర్థమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరాచక శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. దీంతో కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

BJP
GHMC
Hyderabad
TRS
Police
KTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News