Andhra Pradesh: రూ.6,054.29 కోట్లు నష్ట పోయాం.. సాయం చేయండి ప్లీజ్.. వరద నష్టంపై ప్రధాని, హోం మంత్రికి సీఎం జగన్ అభ్యర్థన

CM Jagan Writes To PM and HM Over Relief Package
  • ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖ
  • భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సవివరణ అంచనాలు
  • 1.42 లక్షల హెక్టార్లలో పంట నష్టం
  • రూ.1,353.82 కోట్ల మేర పంట నష్టం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఇవాళ ఆయన లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని ఆయన గుర్తు చేశారు. రెండు హెలికాప్టర్లు, 17 ఎన్డీఆర్ఎఫ్/ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టామని చెప్పారు.

భారీ వర్షాల ధాటికి 40 మంది చనిపోయారని పేర్కొన్నారు. 196 మండలాల్లోని 1,402 గ్రామాల్లో పెను నష్టం జరిగిందని చెప్పారు. 324 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 69,616 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పలు జాతీయ రహదారులు, చెరువులు, కాలువలు తెగిపోయాయన్నారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, మౌలిక వసతులు డ్యామేజ్ అయ్యాయని, రూ.6,054.29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు.

1.43 లక్షల హెక్టార్లలో వరి, శనగ, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. అరటి, బొప్పాయి. పసుపు, ఉల్లిగడ్డ, కూరగాయల పంటలు 42,299 ఎకరాల్లో నష్టపోయాయన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1,887.65 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. 71 మున్సిపల్ స్కూల్ బిల్డింగులు, కమ్యూనిటీ కేంద్రాలు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 2,254.32 కిలోమీటర్ల పొడవైన 1,013 పంచాయతీ రోడ్లు, 9 బిల్డింగులు దెబ్బతిన్నాయని చెప్పారు. 1,085 గ్రామీణ నీటి సరఫరా పనులు, 376 పంపింగ్ యంత్రాలు, 183 ఇన్ టేక్ నిర్మాణాలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. 33 కేవీ విద్యుత్ ఫీడర్లు 128, 11 కేవీ ఫీడర్లు 679, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 102 చొప్పున దెబ్బతిన్నాయని, 8,474 స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు.

పంట నష్టం రూ.1,353.82 కోట్లు, పండ్ల తోటల నష్టం రూ.48.06 కోట్లు, రోడ్లు, బిల్డింగుల నష్టం రూ.1,756.43 కోట్లు, నీటిపారుదల శాఖ నష్టం రూ.556.96 కోట్లు, విద్యుత్ శాఖ నష్టం రూ.252.02 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నష్టం రూ.453.33 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నష్టం రూ.381.65 కోట్లు, మున్సిపల్ పరిపాలన నష్టం రూ.1,252.02 కోట్లుగా ఉందని తెలిపారు. వాటికి సంబంధించిన నష్టం అంచనాలను పొందుపరుస్తున్నామని, వీలైనంత త్వరగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంను రాష్ట్రానికి పంపించి ప్రాథమిక అంచనాను సిద్ధం చేయాలని సీఎం జగన్ కోరారు. త్వరగా తమకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Prime Minister
Home Minister
Narendra Modi
Amit Shah

More Telugu News