CM Jagan: కులాల వారీగా జనాభా గణన చేయాలంటూ తీర్మానం చేసిన ఏపీ సర్కారు

CM Jagan advocates for BC population data

  • ఏపీ అసెంబ్లీలో మరో తీర్మానం
  • కులగణన డిమాండ్ కు ఏపీ సర్కారు మద్దతు
  • కేంద్రానికి తీర్మానం పంపుతున్నామన్న సీఎం జగన్
  • బీసీల జనాభా ఎంతో తేలాల్సి ఉందని వెల్లడి

కులాల వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే జనాభా లెక్కలు అవసరమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కులాల వారీగా జనగణన చేయాలంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ జనాభాలో బీసీల సంఖ్య 50 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయని, కానీ వారి సంఖ్య ఎంతన్నది నిర్దిష్టంగా ఏ జనాభా లెక్కల్లోనూ లేవని స్పష్టం చేశారు. జనగణన జరగకపోవడం వల్లే బీసీలు వెనుకబడిపోయారని తెలిపారు.

1931లో బ్రిటీష్ పాలనలో ఓసారి కులపరమైన జనాభా గణన జరిగిందని, అప్పటి నుంచి బీసీల జనాభా సంఖ్యను అంచనాల ప్రకారమే వెల్లడిస్తున్నారు తప్ప, కచ్చితమైన సమాచారం ఎక్కడా లేదని వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదని తెలిపారు.

రాజకీయ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు ఎంతన్నది తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలకు స్పష్టత ఏర్పడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే కులాల వారీగా జనగణన చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నామని వివరించారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కులగణన డిమాండ్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News