Andhra Pradesh: పోటెత్తుతున్న పెన్నా.. తెగిన కోవూరు హైవే.. 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం

Penna Streams Dangerously Kovuru High Way Damaged
  • ఒకే వైపు నుంచి సాగుతున్న రాకపోకలు
  • పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు
  • తిరుపతి నుంచి వచ్చే వాహనాలు కడప, దర్శి మీదుగా మళ్లింపు
పెన్నా నది పోటెత్తుతోంది. భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద 16వ నెంబర్ చెన్నై–కోల్ కతా జాతీయ రహదారి కోతకు గురైంది. వాహనాలను ముందుకు కదలకుండా చేసింది. విజయవాడ–నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకే వైపు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

దీంతో పలు మార్గాల్లో వాహనాలను అధికారులు దారి మళ్లించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద నిలిపేశారు. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపై నిలిచిపోయాయి. ఒంగోలు–నెల్లూరు మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబై హైవేపై వరద తగ్గడంతో పోలీసులు వాహనాలకు లైన్ క్లియర్ చేశారు. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తున్నారు.
Andhra Pradesh
Rains
Floods
Nellore District
Penna River

More Telugu News