COVID19: కరోనా తర్వాత మారిన పద్ధతి.. ఆన్‌లైన్‌లోనే అప్పు తీసుకుంటున్న యువత

Online loans increased after covid says survey

  • కరోనా రెండో దశ తర్వాత ఆన్‌లైన్ రుణాల పెరుగుదల
  • సర్వే నిర్వహించిన ‘హౌ ఇండియా బారోస్’
  • కరోనా ప్రభావం నుంచి వేగంగా కోలుకున్న హైదరాబాద్, బెంగళూరు

సాధారణంగా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే చాలా పాట్లు పడాల్సి ఉంటుంది. తొలుత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం బ్యాంకు స్టేట్‌మెంటు, పే స్లిప్పులు లాంటి సవాలక్ష సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో కొంతమార్పు వచ్చింది. ఆన్‌లైన్‌లోనే నిమిషాల వ్యవధిలోనే రుణాలు ఇచ్చే సంస్థలు పుట్టుకొచ్చాయి. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగకుండానే పని పూర్తవుతోంది. కరోనా రెండో దశ తర్వాత ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు హోం క్రెడిట్ ఇండియా సంస్థ ‘హౌ ఇండియా బారోస్’ సంస్థ సర్వేలో వెల్లడైంది.

ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు సహా 9 నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. కరోనా నేపథ్యంలో గతేడాది దాదాపు 85 శాతం మంది ఇంటి ఖర్చుల కోసం రుణాలు తీసుకోగా, ఈ ఏడాది 4 శాతం మాత్రమే అప్పు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడమే ఇందుకు కారణమని సర్వే సంస్థ పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న 21-45 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతానిపైగా ఆన్‌లైన్‌‌లో రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. కొత్త వ్యాపారాల ప్రారంభం, ఉన్న వ్యాపారాల విస్తరణ, ఆరోగ్య అత్యవసరాలు, వాహనాల కొనుగోలు, వివాహం, విద్య తదితర వాటికోసం రుణాలు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. కొవిడ్ ప్రభావం నుంచి హైదరాబాద్, బెంగళూరు వేగంగా కోలుకున్నట్టు సర్వే వివరించింది.

  • Loading...

More Telugu News