CM Jagan: మోషేన్ రాజును స్వయంగా చైర్ వద్దకు తీసుకువచ్చిన సీఎం జగన్
- ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు
- హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
- మోషేన్ రాజు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని వెల్లడి
- పార్టీ ఆవిర్భావం నుంచి తనతోనే ఉన్నాడని వివరణ
ఏపీ శాసనమండలి కొత్త చైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. మోషేన్ రాజును సీఎం జగన్ స్వయంగా మండలి చైర్మన్ పీఠం వద్దకు తోడ్కొని వచ్చారు. ఈ క్రమంలో సీఎంకు మోషేన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి మోషేన్ రాజు తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారని వివరించారు. వ్యక్తిగతం గానూ మోషేన్ రాజుతో తనకు అనుబంధం ఉందని, వైసీపీ ప్రారంభించినప్పటి నుంచి తనతోనే ఉన్నారని జగన్ వెల్లడించారు. ఇవాళ మోషేన్ రాజును మండలి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టడం సంతృప్తి కలిగిస్తోందని తెలిపారు. మోషేన్ రాజు ఎంతో కష్టపడి ఎదిగిన నేత అని కొనియాడారు.
20 సంవత్సరాల పిన్న వయసులోనే భీమవరం కౌన్సిలర్ గా ఎన్నికై, అక్కడి నుంచి క్రమంగా ఎదిగారని వివరించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టిన మోషేన్ రాజు ఇవాళ శాసనమండలి చైర్మన్ కావడం హర్షణీయం అని పేర్కొన్నారు.