CM Jagan: చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన వారి కోసం హెలికాప్టర్ పంపించిన సీఎం జగన్
- వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
- అనంతపురం జిల్లాలో చిత్రావతి నదికి వరదలు
- గల్లంతైన కారు
- కారులోని వ్యక్తుల కోసం నదిలోకి వెళ్లిన స్థానికులు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎడతెరిపిలేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా చిత్రావతి నది కూడా వరద రూపుదాల్చింది. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతవగా, నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 మంది తిరిగి బయటికి వచ్చే వీల్లేక నదిలోనే ఓ జేసీబీపైనే ఉండిపోయారు.
వరద ఉద్ధృతి అంతకంతకు అధికమవుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం జగన్ కు దీనిపై సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లాకు ఓ హెలికాప్టర్ పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ రావడంతో చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన 10 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.