Pawan Kalyan: వ్యవసాయ చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారు: పవన్ కల్యాణ్
- వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా తీవ్ర వ్యతిరేకత
- ఉద్యమించిన రైతులు
- దిగొచ్చిన కేంద్రం
- పార్లమెంటు సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న మోదీ
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని కొనియాడారు.
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు చట్టాలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను చాటుతోందని పేర్కొన్నారు.
గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం ఆద్యంతం పరిశీలిస్తే జనవాక్కును శిరోధార్యంగా భావించినట్టు అర్థమవుతోందని తెలిపారు. ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని, ఇది శుభపరిణామం అని పవన్ కల్యాణ్ వివరించారు. పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదని రైతుల ఉద్యమంతో నిరూపితమైందని అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
వరద ఉద్ధృతిలో 30 మంది గల్లంతవడం బాధాకరం
భారీ వర్షాల కారణంగా కడప జిల్లా చెయ్యేరులో 30 మంది గల్లంతవడం పట్ల పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. శివాలయంలో దీపారాధనకు వెళ్లిన భక్తులు, పూజారి కొట్టుకుపోయారన్న సమాచారం తనను బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. చెయ్యేరులో కొట్టుకుపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని వివరించారు. వరద ఉద్ధృతిని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసుంటే బాగుండేదని, ప్రజల్ని ఆ మేరకు అప్రమత్తం చేస్తే ఈ ఘటన జరిగుండేది కాదని పవన్ స్పష్టం చేశారు.