Bihar: బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై పోలీసుల దాడి.. తుపాకి గురిపెట్టిన వైనం!

2 Policemen Attack Judge In Bihar Court

  • తమ ప్రమేయం ఉన్న కేసు విచారణ సందర్భంగా దాడికి దిగిన పోలీసులు
  • అడ్డొచ్చిన లాయర్లు, కోర్టు సిబ్బందిపైనా దాడి
  • తీవ్రంగా పరిగణించిన పాట్నా హైకోర్టు

బీహార్‌లోని మధుబని జిల్లాలో ఇద్దరు పోలీసులు కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై దాడికి దిగడం సంచలనమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన పాట్నా హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా తీసుకుని, స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.

తమ ప్రేమేయం ఉన్న కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో జాన్‌జహాపూర్ కోర్టు హాలులోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసులు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అవినాశ్ కుమార్‌పై తుపాకి గురిపెట్టి దాడి చేశారు. ఈ ఘటన నుంచి న్యాయమూర్తి సురక్షితంగా బయటపడినా, ఈ హఠాత్‌ పరిణామంతో వణికిపోయిన ఆయన ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.

న్యాయమూర్తిని రక్షించేందుకు ప్రయత్నించిన లాయర్లు, కోర్టు ఉద్యోగులపైనా నిందితులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోపాల్‌కృష్ణ, ఎస్సై అభిమన్యు కుమార్ దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనను ‘అసాధారణ, షాకింగ్’ ఘటనగా అభివర్ణించిన జస్టిస్ రాజన్ గుప్తా, మోహిత్ కుమార్ షాతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. ఈ దారుణ ఘటనపై ఈ నెల 29న సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. అంతేకాదు, ఆ రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది.

ఈ ఘటన న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేస్తుందని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సరైనదని తాము భావిస్తున్నామని, అలాగే, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బీహార్ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ, మధుబని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నట్టు పేర్కొంది. కాగా, ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారులు ఎవరూ పెదవి విప్పకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News