Etela Rajender: నా గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదు: ఈటల ఫైర్
- సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది?
- కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెపుతారు
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. పథకాలు, డబ్బులతో పాటు పలు ప్రలోభాలకు కేసీఆర్ గురిచేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రూ. 600 కోట్లను ఖర్చుపెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని అన్నారు.
2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెపుతారని ఈటల జోస్యం చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెపుతున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటలను బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 'నిధులు కేంద్రానివి, పథకాలపై ఫొటోలు మాత్రం కేసీఆర్ వి' అంటూ ఆయన దుయ్యబట్టారు.