Botsa Satyanarayana: పిడికెడు మంది చేస్తున్న ఉద్యమానికి స్వాతంత్ర్య పోరాటంతో లింకేంటి?: బొత్స సత్యనారాయణ
- కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని అనుకోవడం లేదు
- అలా మాట్లాడివుంటే కనుక అది దురదృష్టకరమే
- ప్రజల కోసం త్యాగాలు చేసి మరణించిన వారినే అమరులంటారన్న బొత్స
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఏపీ హైకోర్టు స్వాతంత్రోద్యమంతో పోల్చడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడివుంటే కనుక అది దురదృష్టకరమేనన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ఈ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని అన్నారు. పిడికెడు మంది చేస్తున్న ఉద్యమానికి, స్వాతంత్ర్య పోరాటానికి బోల్డంత తేడా ఉందన్నారు.
మహానుభావులు చేసిన స్వాంతంత్ర్య పోరాటానికి.. స్వార్థపూరిత రాజకీయం, ధనదాహంతో చేస్తున్న దానికి పోలిక ఎక్కడుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమంలో రైతులు అమరులయ్యారని చెప్పడం కూడా సరికాదన్నారు.
90, 100 సంవత్సరాలు వచ్చాక కానీ, లేదంటే అనారోగ్యంతో కానీ వారు చనిపోయి ఉండొచ్చన్నారు. ఉద్యమంలో కాల్పులు జరిగి మరణించిన, ప్రజల కోసం త్యాగాలు చేసి చనిపోయిన వారినే అమరులు అంటారని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంలో కాల్పులు జరిగి అలా జరిగిందనీ, అలాంటి ఘటన ఇప్పుడు జరిగిందా? అని బొత్స ప్రశ్నించారు.