Kerala: తలాక్ చెప్పలేదని భర్తపై దాడిచేసి, చితకబాదిన భార్య, కుటుంబ సభ్యులు
- నాలుగు నెలల క్రితమే పెళ్లి
- ఆపై కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
- అసీబ్ పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి చితకబాదిన భార్య కుటుంబ సభ్యులు
- కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి ట్రిపుల్ తలాక్ చెప్పాలంటూ మరోమారు దాడి
భార్యతో బలవంతంగా ట్రిపుల్ తలాక్ చెప్పించి విడాకులు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, కేరళలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. భార్య నుంచి విడిపోవడం ఇష్టం లేని భర్త ముమ్మారు తలాక్ చెప్పేందుకు నిరాకరించగా భార్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి అతడిపై దాడిచేసి చితకబాదారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రంలోని కొట్టకాల్‌కు చెందిన అబ్దుల్ అసీబ్‌కు ఫాతిమా షాహిమాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు చెలరేగడంతో మనస్తాపం చెందిన ఫాతిమా పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ మనస్పర్థలకు ఆమె భర్త అసీబ్ కారణమని భావించిన ఫాతిమా కుటుంబ సభ్యులు అతడిపై దాడిచేశారు. అతడు ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్లి మరీ దారుణంగా దాడిచేసి గాయపరిచారు. అంతేకాక ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేయాలని బెదిరించారు. అక్కడితో ఆగక అసీబ్‌ను కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి మళ్లీ చితకబాదారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అసీబ్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసీబ్ మాట్లాడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని పేర్కొన్నాడు. తన భార్య ప్రస్తుతం పుట్టింట్లోనే ఉందని, ట్రిపుల్ తలాక్ చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు తనను కత్తితో బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.