Tomota: చుక్కలనంటుతున్న టమాటా ధర.. వ్యవసాయ మార్కెట్‌లోనే కిలో రూ. 100!
- బహిరంగ మార్కెట్లో రూ. వందకు పైనే విక్రయం
- ఏపీలో వరుస వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట
- రెండు రోజుల్లోనే సగానికి సగం పెరిగిన ధర
కూర ఏదైనా అందులో టమాటా పడితే ఆ టేస్టే వేరు. అందుకే ప్రతి ఇంటి వంటగదిలోనూ అది కనిపిస్తుంది. అది లేని వంటకం చాలామందికి రుచించదు మరి. అయితే, ఇప్పుడు దాని వంక చూడాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలకు చేరి ఇంకా ఆకాశంవైపే చూస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది.
రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడమే రేటు ఎగబాకడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 28 కిలోలు ఉండే క్రేట్ ధర మార్కెట్‌లో గరిష్ఠంగా రూ. 2,800 పలికింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 100కు పైనే పలికే అవకాశం ఉంది.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తమిళనాడుకు కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లోనూ టమాటాలకు ఇంతే ధర పలికింది. రెండు రోజుల క్రితం ఇక్కడ రూ. 50-60 మధ్య విక్రయించగా అంతలోనే రూ. 100కు చేరడం గమనార్హం.