CM KCR: కేంద్రంపై కేసీఆర్ సమరభేరి... ఈ నెల 18న టీఆర్ఎస్ మహాధర్నా
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ
- రేపు కేంద్రానికి లేఖ రాస్తానన్న కేసీఆర్
- ధాన్యం అంశంలో జవాబు ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
- రైతులను కాపాడుకుంటామని వెల్లడి
ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. హైదరాబాదు తెలంగాణ భవన్ లో ఈ సాయంత్రం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) ఏడాదికి తీసుకునే ధాన్యం వివరాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. తమ లేఖకు కేంద్రం జవాబు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని ప్రశ్నించబోతున్నారని, ఈ నెల 18న హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా కొనసాగుతుందని వివరించారు. ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడమే తమకు ముఖ్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.