Virat Kohli: స్వలింగ సంపర్కులకు ప్రవేశం నిరాకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ రెస్టారెంట్
- కోహ్లీకి దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు
- వన్8 కమ్యూన్ పేరిట గొలుసు రెస్టారెంట్లు
- పూణే రెస్టారెంటుపై స్వలింగ సంపర్కుల సంఘం ఆరోపణ
- స్వలింగ జంటలను అనుమతించడంలేదని అసంతృప్తి
టీమిండియా టెస్టు, వన్డే జట్ల సారథి విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వ్యాపారంలోనూ కాలుమోపిన సంగతి తెలిసిందే. కోహ్లీకి దేశవ్యాప్తంగా వన్8 కమ్యూన్ అనే గొలుసు రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే పూణేలోని కోహ్లీ రెస్టారెంటు అనూహ్యరీతిలో వివాదంలో చిక్కుకుంది. ఈ రెస్టారెంటులోకి స్వలింగ సంపర్కులను, ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులను అనుమతించడంలేదని 'యస్ ఉయ్ ఎగ్జిస్ట్ ఇండియా' అనే సంఘం ఆరోపిస్తోంది.
'యస్ ఉయ్ ఎగ్జిస్ట్ ఇండియా' సంఘంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్లు సభ్యులుగా ఉంటారు. ఈ సంఘం స్పందిస్తూ, పూణేలోని వన్8 కమ్యూన్ రెస్టారెంటులో కేవలం మహిళల బృందాలను, భిన్నలింగత్వ జంటలను మాత్రమే అనుమతిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వన్8 రెస్టారెంట్లలోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ స్వలింగ సంపర్కుల సంఘం ఆరోపించింది.
దీనిపై వన్8 కమ్యూన్ వర్గాలు స్పందించాయి. 'యస్ ఉయ్ ఎగ్జిస్ట్ ఇండియా' సంఘం చేసిన ఆరోపణలను ఖండించాయి. తమ అవుట్ లెట్లలో ఎలాంటి లింగ వివక్షకు తావులేదని, అన్ని వర్గాలకు ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశాయి. తమ రెస్టారెంట్లు ప్రారంభమైన నాటి నుంచి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చామని వన్8 ప్రతినిధులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇతర సంస్థలకు చెందిన రెస్టారెంట్లలో ఎలాంటి నియమావళి అమలు చేస్తారో, తమ రెస్టారెంట్లలోనూ అదే పద్థతి పాటిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఏ వర్గం పట్ల వివక్ష ప్రదర్శించడంలేదని పేర్కొన్నారు.
అయితే, ఏ తోడు లేకుండా ఒంటరిగా వచ్చే వారికి అనుమతిపై నిషేధం ఉందని, తమ అతిథులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే క్రమంలో దీన్ని అమలు చేస్తున్నామని వివరించారు. విరాట్ కోహ్లీ జెర్సీపై 18 నెంబరు ఉంటుంది. ఈ నెంబరును ఆధారంగా చేసుకునే కోహ్లీ తన రెస్టారెంట్ బిజినెస్ కు వన్8 అని నామకరణం చేశాడు.