IMD: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- అండమాన్ సముద్రం నుంచి బంగాళాఖాతంలోకి అల్పపీడనం
- పశ్చిమ దిశగా పయనం
- ఐఎండీ తాజా బులిటెన్ విడుదల
- ఏపీలో రెండ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
- రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఏపీపై దీని ప్రభావం బుధ, గురువారాల్లో గణనీయమైన స్థాయిలో ఉంటుందని పేర్కొంది. కోస్తాంధ్రలో బుధవారం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వివరించింది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
ఇక గురువారం దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తాజా బులెటిన్ లో వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వర్షాలను గమనించుకుంటూ రైతులు వ్యవసాయపనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కాగా, పలు ప్రైవేటు వాతావరణ సంస్థల వెదర్ మోడల్స్ పరిశీలిస్తే, గురువారం నాటికి అల్పపీడనం ఏపీ తీరానికి చేరువకు రానుందని అర్థమవుతోంది. ఆ రోజున కోస్తాంధ్రపై అత్యధిక ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. అటు, అరేబియా సముద్రంలోనూ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ఓ ప్రకటనలో వెల్లడించింది.