Supreme Court: టీటీడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court dismisses petition against TTD

  • శ్రీవారి కైంకర్యాలు సరిగా జరగడం లేదంటూ పిటిషన్
  • నిబంధనలు పాటించడం లేదంటూ ఆరోపణ
  • ఆలయాల్లో కైంకర్యాలు కోర్టుల పనికాదన్న ధర్మాసనం
  • సరైన ఫోరంను ఆశ్రయించాలని పిటిషనర్ కు హితవు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. తిరుమల శ్రీవారి కైంకర్యాలు నిబంధనల మేరకు జరగడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, పూజలు, కైంకర్యాలు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని టీటీడీ అఫిడవిట్ సమర్పించింది.

దీనిపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది. టీటీడీ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ తీరు చూస్తుంటే ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఆలయాలకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలను న్యాయస్థానాలు చేపట్టవన్న విషయం పిటిషనర్ గుర్తెరగాలని హితవు పలికింది. ఆలయాల్లో పూజలు, ఇతర కైంకర్యాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులకు సంబంధించిన విషయం అని స్పష్టం చేసింది.

అయితే, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు టీటీడీకి సూచించింది. పూజా కైంకర్యాలపై సూచనలను టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరంను ఆశ్రయించాలని అటు పిటిషనర్ కు సూచించింది.

  • Loading...

More Telugu News