ఆ గున్న ఏనుగు పేరు ఇకపై ‘పునీత్ రాజ్‌కుమార్!’
- మరణానికి కొన్ని రోజుల ముందు సక్రెబైలు ఏనుగు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన పునీత్
- రెండేళ్ల వయసున్న ఏనుగు పిల్లతో కాలక్షేపం
- స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు
ఏనుగు పిల్లకు నటుడి పేరు పెట్టడంపై ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ నాగరాజ్ మాట్లాడుతూ.. తాము సాధారణంగా దేవుళ్ల పేర్లే పెడతామన్నారు. కానీ, ఈసారి స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్‌కు ఎంతో ఇష్టమైన ఈ ఏనుగు పిల్లకు ఆయన పేరుపై నామకరణం చేసినట్టు చెప్పారు. ఆయన పేరు పెట్టినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ సెప్టెంబరులో సక్రెబైలు ఏనుగు శిక్షణాకేంద్రాన్ని చివరిసారి సందర్శించారు. అంతకుముందు ఈ ఏడాది మొదట్లో ఏనుగుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ఒకసారి ఈ కేంద్రాన్ని పునీత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ గున్న ఏనుగుతో కొంతసేపు గడిపారు.
ఈ గున్న ఏనుగు తల్లి పేరు నేత్ర. సాధారణంగా ఏనుగు పిల్లకు రెండేళ్లు రాగానే తల్లి నుంచి దానిని వేరు చేస్తారు. అయితే, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ మూడు నెలలు వాయిదా పడింది. రెండేళ్ల వయసులో తల్లి నుంచి పిల్లను వేరు చేయకపోతే ఆ తర్వాత దానిని నియంత్రించడం కష్టమవుతుందని నాగరాజ్ తెలిపారు.