Karnataka CM: మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తున్నాం: కర్ణాటక ముఖ్యమంత్రి
- బలవంతపు మత మార్పిడిలను రాజ్యాంగం ఒప్పుకోదన్న సీఎం బొమ్మై
- ఇతర రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేస్తున్నామని వెల్లడి
- మతం మార్చుకునే వారికి సంక్షేమ పథకాలను ఆపేయాలన్న హిందూ సంఘాలు
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. మత మార్పిడిని నిరోధించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. బలవంతపు మత మార్పిడిలను రాజ్యాంగం ఒప్పుకోదని అన్నారు.
మరోవైపు హిందూ మతానికి చెందిన 50 మందికి పైగా హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు ఇటీవల బొమ్మైను కలిశారు. బలవంతపు మత మార్పిడిలపై నిషేధం విధించాలని సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో హిందూ జనజాగృతి సమితి కన్వీనర్ మోహన గౌడ, శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాళిక్, సంతోష్ గురూజీ, సిద్ధలింగ స్వామి, ప్రణవానంద స్వామి తదితరులు ఉన్నారు.
మరోవైపు ప్రమోద్ ముతాళిక్ మాట్లాడుతూ, స్కూళ్లు, ఆసుపత్రులను మతమార్పిడిలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇల్లీగల్ గా ఎన్నో చర్చిలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. మతాన్ని మార్చుకునే ఎస్సీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలని సీఎంకు వీరంతా సూచించారు.