Mohammad Rizwan: పాక్ ఆటగాడు అంత త్వరగా కోలుకుంటాడని అనుకోలేదు: భారత వైద్యుడు సహీర్
- టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడిన పాక్
- మ్యాచ్ కు ముందు రెండ్రోజులు ఐసీయూలో ఉన్న రిజ్వాన్
- తీవ్ర ఛాతీ ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిక
- దుబాయ్ మెడియోర్ ఆసుపత్రిలో చికిత్స
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ కు ముందు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ రెండ్రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందడం తెలిసిందే. ఛాతీలో తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురైన రిజ్వాన్, చికిత్స అనంతరం బరిలో దిగి 67 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కాగా, రిజ్వాన్ కు దుబాయ్ లోని మెడియోర్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఈ పాకిస్థానీ క్రికెటర్ కు వైద్య సేవలు అందించింది ఓ భారతీయ వైద్యుడు. ఆయన పేరు సహీర్ సైనాలబ్దీన్. సహీర్ మెడియోర్ ఆసుపత్రిలో పల్మనాలజిస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
కాగా, ఛాతీ ఇన్ఫెక్షన్ ఎంతో ముదిరిన దశలో రిజ్వాన్ ఆసుపత్రికి వచ్చాడని, కానీ అతడు రెండ్రోజుల్లోనే కోలుకోవడం తమను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసిందని డాక్టర్ సహీర్ వెల్లడించారు. నేను సెమీఫైనల్ మ్యాచ్ ఆడాల్సిందే... నేను జట్టులో ఉండాలి అని రిజ్వాన్ ఐసీయూలో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. రిజ్వాన్ ఆసుపత్రికి రాగానే అతడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వరపేటికలో అధికస్థాయిలో ఇన్ఫెక్షన్ గుర్తించామని, ఆ ఇన్ఫెక్షన్ అన్నవాహికకు పాకి, అక్కడినుంచి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసిందని డాక్టర్ సహీర్ వివరించారు.
దేశం కోసం ఆడాలన్న బలమైన ఆకాంక్ష అతడిలో కనిపించిందని, అతడి ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పట్లో కోలుకోవడం కష్టమనిపించేలా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఐసీయూ నుంచి బయటికి రావడానికే 5 నుంచి 7 రోజులు పడుతుందని, కానీ రిజ్వాన్ ఇంతవేగంగా ఆరోగ్యాన్ని సంతరించుకోవడం, పైగా మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడం విస్మయం కలిగించిందని పేర్కొన్నారు.
అతడి మనోధైర్యమే అతడిని కోలుకునేలా చేసిందని భావిస్తున్నట్టు తెలిపారు. అతడి శారీరక దారుఢ్యం కూడా అందుకు సహకరించిందని వెల్లడించారు.
కాగా, రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందిన విషయం సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడైంది. రిజ్వాన్ ఐసీయూ బెడ్ పై ఉన్నప్పటి ఫొటోను పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది.