Norovirus: నోరో వైరస్... కేరళలో వెలుగు చూసిన కొత్త వైరస్
- వాయనాడ్ లో వైరస్ నిర్ధారణ
- కేరళ ఆరోగ్యమంత్రి సమీక్ష
- మార్గదర్శకాల విడుదల
- జంతువుల నుంచి వ్యాప్తి చెందే నోరో వైరస్
కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేగింది. దీని పేరు నోరో వైరస్. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా సోకుతుంది. నోరో వైరస్ కేసులను కేరళలోని వాయనాడ్ లో గుర్తించారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి స్పందిస్తూ... నోరో వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ వైరస్ మరింత ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో దీని పట్ల విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించాలని అధికారులను ఆదేశించారు.
వాయనాడ్ లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వీణా జార్జి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి ముప్పు లేకపోయినా, ప్రజలు జాగరూకతతో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
నోరో వైరస్ అనేది అనేక రకాల వైరస్ ల సమూహం. ఇది ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి అస్వస్థతకు గురిచేస్తుంది. ఉదరం, పేగుల్లోని కీలక పొరను దెబ్బతీస్తుంది. దీని ప్రభావంతో తీవ్రస్థాయిలో వాంతులు, విరేచనాలతో బాధపడతారు. డయేరియా, కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలను ఈ వైరస్ కలిగిస్తుంది.
పరిపూర్ణ ఆరోగ్యవంతులపై ఇది పెద్దగా ప్రభావం చూపదని, అయితే చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి నోరో వైరస్ ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు తెలిపారు. జంతువుల ద్వారానే కాకుండా, ఈ వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కూడా ఇది మనుషులకు వ్యాపిస్తుంది.
భోజనం ముందు, టాయిలెట్ కు వెళ్లొచ్చిన తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.