Kajal Agarwal: 'ఇండియన్ 2'కి ఎదురవుతున్న మరో ఇబ్బంది?
- కమలహాసన్ తో శంకర్ 'ఇండియన్ 2'
- ఇప్పటికే పలు కారణాలతో షూటింగుకి బ్రేక్
- డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్
- ఇప్పుడు కథానాయిక కాజల్ తో సమస్య
గతంలో కమలహాసన్, శంకర్ కలయికలో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ఇప్పుడు 'ఇండియన్ 2' సీక్వెల్ నిర్మిస్తున్న సంగతి విదితమే. అయితే, ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ, దీనికి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
ఆమధ్య సినిమా షూటింగులో అగ్నిప్రమాదం జరిగి కొందరు యూనిట్ సభ్యులు మరణించడం.. ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి.. దాని తర్వాత నిర్మాతలకు, దర్శకుడికి మనస్పర్థలు రావడం.. హైకోర్టు మెట్లెక్కడం.. చివరికి మేకర్స్, డైరెక్టర్ మధ్య రాజీ కుదరడం.. మనకు తెలిసిందే. దీంతోనే ఈ చిత్ర నిర్మాణం ఆలస్యమైపోయి, నిర్మాతకు ఇప్పటికే ఆర్థికంగా బోలెడు నష్టం చేకూరింది.
ఇక డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూలు ప్రారంభించి షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలో, ఇప్పుడు వీరికి మరో కొత్త సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. అదేమిటంటే, కథానాయిక కాజల్ డేట్స్ సమస్య! ఆమధ్య పెళ్లి చేసుకున్న కాజల్ ప్రస్తుతం గర్భవతి అంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పుడీ చిత్రం షూటింగులో పాల్గొనడం వీలుకాకపోవచ్చని అంటున్నారు. దీంతో నిర్మాతలకు కొత్త తలనొప్పి ఎదురైందని అంటున్నారు. ఆమె కోసం ఆగడమా? లేక ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవడమా? అన్న మీమాంసలో మేకర్స్ ఉన్నారట. మరి, ఏమవుతుందో చూడాలి!