Online Ticketing: ఆన్ లైన్ సినిమా టికెట్ల విధానంపై స్పీడు పెంచిన ఏపీ సర్కారు
- మూడు జిల్లాల ఎగ్జిబిటర్లతో పేర్ని నాని సమావేశం
- టికెట్ల విధానం, గ్రేడింగ్ సిస్టమ్ పై చర్చ
- సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి
- త్వరలో ఆన్ లైన్ విధానంపై ప్రకటన
ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకం విధివిధానాల రూపకల్పన కోసం ఏపీ సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఏపీ సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని సినీ ఎగ్జిబిటర్లతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిగా ఆయన గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ల విధానం, థియేటర్ల సమస్యలను ఎగ్జిబిటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆన్ లైన్ టికెట్ల విధానం తమకు సమ్మతమేనని వారు ఆయనకు తెలిపారు. అయితే, ఆన్ లైన్ లో టికెట్ల విక్రయానికి సంబంధించి కొన్ని ప్రైవేటు యాప్ లతో ఐదేళ్ల ఒప్పందం ఉందని ఎగ్జిబిటర్లు మంత్రికి చెప్పగా, లీగల్ సమస్యలు రాకుండా సదరు యాప్ ల నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఇక థియేటర్ల గ్రేడింగ్ విధానం, టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యంపై సీఎం జగన్ తో చర్చించాల్సి ఉందని మంత్రి పేర్ని నాని ఎగ్జిబిటర్లతో చెప్పారు. మిగిలిన జిల్లాల ఎగ్జిబిటర్లతో కూడా సమావేశాలు నిర్వహించి ఆన్ లైన్ టికెట్ల విధానంపై ప్రకటన చేస్తామని అన్నారు.