Telangana: ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం చేయించిన భద్రాద్రి కలెక్టర్
- మంగళవారం అర్ధరాత్రి పురిటినొప్పులు
- భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లిన అనుదీప్
- సిజేరియన్ చేసిన వైద్యులు
- కలెక్టర్ దంపతులకు పండంటి మగబిడ్డ జననం
ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న కాలమిది. సేవలు సరిగ్గా అందవని, మంచి చికిత్స చేయరని చాలా మంది వాటివైపు కూడా వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ముందడుగు వేశారు. తన భార్య మాధవికి ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మంగళవారం అర్ధరాత్రి పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒంటిగంటకు వైద్యులు సిజేరియన్ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఆమె ఇక్కడే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ స్నేహలత కూడా ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించుకున్నారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంతకుముందు భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి కూడా తన కూతురు ప్రగతికి ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీ చేయించారు.