TRS: రైతులకు సంఘీభావంగా ఆందోళనలకు సిద్ధమవుతోన్న టీఆర్ఎస్.. పార్టీ శ్రేణులకు కేటీఆర్, తలసాని సూచనలు
- ఈనెల 12న రైతులకు సంఘీభావంగా నిరసనలు
- తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు
- రైతులతో కలిసి చేయాలని కేటీఆర్ పిలుపు
- ధర్నాచౌక్ పరిశీలించిన తలసాని, మహమూద్ అలీ
వరి కొనుగోలు విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న రైతులకు సంఘీభావంగా ఆందోళనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని చెప్పారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఏయే ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించాలన్న విషయంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు స్థానిక రైతులను కలుపుకుని ధర్నాలు చేయాలని ఆయన సూచనలు చేశారు.
మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ శ్రేణులకు కీకల సూచనలు చేశారు. ధర్నాలకు విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు మీడియాకు తెలిపారు.
ధర్నాచౌక్ వద్ద స్థలాన్ని మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు. పంజాబ్ తరువాత అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో కొత్త సాగు చట్టాల ద్వారా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ తెలంగాణ నేతలు రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర సర్కారు మెడలు వంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వరి పండించాలని రైతులకు చెబుతున్నారని, అయితే, కేంద్రంలోని బీజేపీ మాత్రం ధాన్యాన్ని కొనబోమని అంటోందని ఆయన చెప్పారు.
కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి దేశ వ్యాప్తంగా విపక్షాల మద్దతు కోరతామని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు. కాగా, ఈ నెల 12న గజ్వేల్ పట్టణంలోని కోటమైసమ్మ నుంచి ఏడు వేల మంది రైతులతో ర్యాలీ నిర్వహించడానికి టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది.