Kodandaram: హిట్లర్ పుస్తకాలు చదివీ చదివీ కేసీఆర్ అలా మారిపోయారు: కోదండరామ్
- విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
- హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్
- కేసీఆర్ నియంతలా మారిపోయారన్న కోదండరామ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యారంగంలో పాతుకుపోయిన సమస్యలతోపాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిన్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్‌రెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ పుస్తకాలు చదివీ చదివీ ఆయనలా నియంతలా మారిపోయారని అన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, స్వచ్ఛ కార్మికుల నియామకం వెంటనే చేపట్టాలన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటు దోపిడీకి వదిలేసిందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు.