Chandrababu: విద్యాసంస్థను కాపాడుకునేందుకు నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను హింసించడం అన్యాయం: చంద్రబాబు

Chandrababu fires on AP govt

  • అనంతపురంలో విద్యార్థుల ఆందోళన
  • ఎయిడెడ్ కాలేజీ మూసివేత వద్దంటూ నిరసన
  • విద్యార్థులను దారుణంగా కొట్టారన్న చంద్రబాబు
  • ప్రజాస్వామ్యమా, రాక్షసరాజ్యమా? అంటూ ఆగ్రహం

ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేతను నిరసిస్తూ అనంతపురంలో ఆందోళన నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుగ్లక్ పాలనలో తమ విద్యాసంస్థను కాపాడుకునేందుకు విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని, కానీ ఆ విద్యార్థులను ఉగ్రవాదుల కంటే దారుణంగా హింసించడం అన్యాయమని పేర్కొన్నారు.

అనంతపురంలో ఎస్ఎస్ బీఎన్ ఎయిడెడ్ కాలేజీని కొనసాగించాలని డిమాండ్ చేయడమే ఆ సరస్వతీ పుత్రులు చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులు అత్యంత ఘోరంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

"విద్యార్థులకు మేనమామ అంటూ ప్రకటిస్తారు... అత్యంత దారుణంగా వారినే హింసిస్తారు" అంటూ విమర్శించారు. మేనమామ అంటే బతుకు కోరేవాడని, ఇలా బడులు, కళాశాలలు మూసేవాడు కాదని వ్యాఖ్యానించారు. ఇదేంటని అడిగితే అరాచకంగా దాడి చేసేవాడు మేనమామ కాదని పేర్కొన్నారు.

"సంఘ విద్రోహక శక్తులు, డ్రగ్స్ మాఫియాలకు రక్షణగా నిలిచేందుకా రాష్ట్రంలో పోలీసులు ఉన్నది?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల కనీస మానవత్వం చూపకుండా కొందరు పోలీసులు రౌడీ మూకల్లా మారి ఆ చదువుల తల్లుల రక్తం కళ్లజూడడం పైశాచికత్వానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.

మీ బిడ్డలు తమ విద్యాసంస్థను కాపాడుకునేందుకు ఆందోళన చేస్తే ఇలాగే దాడులు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నించినా, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించినా దాడులే సమాధానమా? లాఠీదెబ్బలే జవాబులా? ఇది ప్రజాస్వామ్యమా, రాక్షసరాజ్యమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News