Keerthi Suresh: 'గుడ్ లక్ సఖి' నుంచి బ్యాడ్ లక్ సఖి సాంగ్ రిలీజ్!
- నాయిక ప్రధానంగా సాగే 'గుడ్ లక్ సఖి'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు
'మహానటి' తరువాత వరుసగా నాయిక ప్రధానమైన కథలను కీర్తి సురేశ్ చేస్తూ వెళ్లింది. అలా వచ్చిన 'మిస్ ఇండియా' పరాజయం పాలైంది. ఫలితంగా ఆ వెంటనే రావలసిన 'గుడ్ లక్ సఖి' విడుదల ఆలస్యమైంది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది.
తాజాగా ఈ సినిమా నుంచి 'బ్యాడ్ లక్ సఖి' అంటూ సాగే పాటను వదిలారు. ఈ సాంగ్ లో సఖిని నష్టజాతకురాలుగా చూపించారు. ఆమె ఎదురువస్తే ఊళ్లో వాళ్లకి నష్టం జరగడం .. ఆమె ఎదురొస్తే వాళ్లంతా భయపడటం సాంగులో భాగంగానే చూపించారు. ఎవరేమన్నా తాను పట్టించుకోననీ .. తన తలరాతను తాను మార్చుకోగలనని సఖి ఇచ్చే ఫినిషింగ్ టచ్ తో పాట పూర్తవుతుంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాట బీట్ హుషారుగా .. గమ్మత్తుగా సాగింది. పాటలో నాయికతో పాటు ఊళ్లో వాళ్లందరినీ భాగం చేయడం కొత్తగా అనిపిస్తుంది. జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.