Andhra Pradesh: నేటికి నాలుగేళ్లంటూ ఏపీ సీఎం జగన్ స్పందన
- ప్రజా సంకల్ప యాత్రపై ట్వీట్
- ప్రజల చేత.. ప్రజల వల్ల.. ప్రజల కోసమేనంటూ కామెంట్
- రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు
వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. రాష్ట్రమంతటా తిరిగి ప్రజలందరినీ కలిశారు. ఆ ప్రజాసంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడూనేడూ నా యాత్ర, నా ప్రయాణం.. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక, ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించాయి.
కాగా, 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి మొదలైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజుల పాటు సాగింది. 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేశారు. 124 సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. మొత్తంగా 3,648 కిలోమీటర్లు నడిచారు.