Chandrababu: పీక మీద కత్తి పెట్టినట్టు పండుగ రోజు కూడా నామినేషన్లు పెట్టారు: చంద్రబాబు

Chandrababu fires on YSRCP govt

  • స్థానిక ఎన్నికలకు నిన్నటి నుంచి ప్రారంభమైన నామినేషన్లు
  • దీపావళి రోజున నామినేషన్ల పక్రియ పెట్టారని చంద్రబాబు మండిపాటు
  • అక్రమాలకు అనువుగా ముందుగానే కొందరు అధికారులను నియమించుకున్నారని ఆరోపణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన... అందరి జీవితాల్లో చీకటి తొలగి వెలుగు రావాలని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దుర్మార్గపు, అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

అసలు దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. క్రిస్మస్ ఉంటే నామినేషన్లు పెట్టేవాళ్లా? అని అడిగారు. జగన్ రహస్య అజెండాలో భాగంగానే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. పీక మీద కత్తిపెట్టినట్టు పండుగరోజున కూడా నామినేషన్ల ప్రక్రియ పెట్టారని అన్నారు. ఒక మతానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు నిన్నటి నుంచి నామినేషన్ల పక్రియ మొదలైన సంగతి తెలిసిందే.

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు చూపించిన ఆవేశాన్ని స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పారు. క్షేత్ర స్థాయి వరకు వెళ్లి పోరాడతానని అన్నారు. ఎన్నికలు సరిగ్గా జరిగితే వైసీపీ గెలవలేదని చెప్పారు.

గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ దారుణాలకు పాల్పడిందని... ఉన్మాదులు తప్ప మరెవరూ ఈ స్థాయిలో చేయలేరనే విధంగా ఆ పార్టీ శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా ముందుగానే కొందరు అధికారులను నియమించుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News